శుక్రవారం, ఏప్రిల్ 19, 2024
లావాదేవీల లెక్కలు క్షణాల్లో..!

స్వైప్‌యాప్‌ను రూపొందించిన హైదరాబాద్‌ కుర్రాళ్లు


ఆదిత్య, శ్రీతేజ

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: వ్యాపార నిర్వహణ ఒక ఎత్తు అయితే అందులోని లెక్కలు చూడటం మరొక ఎత్తు...లెక్కల చిక్కులను తప్పించుకునేందుకు కొందరు వ్యాపారులు సాఫ్ట్‌వేర్‌పై ఆధారపడి అకౌంటెంట్లను నియమించుకుంటారు. మరికొందరు సొంతంగానే ఆ పని చేసుకుంటారు. చిన్నపాటి వ్యాపారాలు నిర్వహించుకునే వారికి ఈ లెక్కలు తెగ చిరాకు తెప్పిస్తుంటాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొన్న హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు కుర్రాళ్లు తమలాగా ఇబ్బంది పడే వ్యాపారుల కోసం సరికొత్త యాప్‌ను ఆవిష్కరించారు. అదే స్వైప్‌ యాప్‌...కేవలం 10 సెకన్లలో బిల్లు జనరేట్‌ చేయడం, వాట్సాప్‌, ఈమెయిల్‌ ద్వారా బిల్లులు పంపడం, క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా బిల్లులు వసూలు చేయడం, ఇన్‌స్టాంట్‌ జీఎస్టీ రిపోర్టును పొందడం, ఆదాయ వ్యయాల నిర్వహణ, ఆన్‌లైన్‌ స్టోర్‌గా మార్చే ఫీచర్లు దీని సొంతం..

* నానాక్‌రామ్‌గూడకు చెందిన ఆదిత్య వేముగంటి, అల్లపర్తి శ్రీతేజ చిన్ననాటి స్నేహితులు. శ్రీతేజ ఐఐఐటీ హైదరాబాద్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేయగా.. ఆదిత్య సియాటెల్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లో ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసి అమెజాన్‌లో ఉద్యోగం చేశారు. అనంతరం ఇద్దరూ 2017లో ఏఐ సాంకేతిక ఆధారంగా ఓ స్టార్టప్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలోనే జీఎస్టీ ఇన్‌వాయిస్‌లు, ఎక్సెల్‌ షీట్లు, బిల్లింగ్‌ తదితరాలు చేసుకోవడంలో ఇబ్బందులు పడేవారు. కొన్నిసార్లు జాప్యం అవడంతో అదనపు రుసుములు చెల్లించేవారు. అకౌంటింగ్‌ కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసినా దానిపై ప్రాథమిక జ్ఞానం లేకుండా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నారు. తాము ఓ సాఫ్ట్‌వేర్‌ను అందిస్తామని చెప్పగా ఓ వ్యాపారి సరేనన్నారు. పదిరోజుల్లో ఎమ్‌వీపీ ప్రోటోటైప్‌ యాప్‌ను అందించగా.. వినియోగం సులువుగా ఉండటంతో భారీ స్పందన వచ్చింది. ఫండింగ్‌, సాంకేతిక సహాయం అందిస్తూ అంకురాలను ప్రోత్సహించే ‘వై కాంబినేటర్‌’ స్టార్టప్‌ యాక్జిలరేటర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సంస్థకు 20వేల దరఖాస్తులు వస్తే అందులో కేవలం 200 స్టార్టప్‌లను ఎంపిక చేశారు. ఆదిత్య, శ్రీతేజ దరఖాస్తు చేసుకోగానే అవకాశం లభించింది. 2 మిలియన్ల వరకు మూలనిధిని పొందారు. 2021లో స్వైప్‌ స్టార్టప్‌ను ప్రారంభించగా దేశవ్యాప్తంగా యూజర్లు పెరిగారు. ప్రస్తుతం 30వేల మంది ఉన్నారు.